

- సంప్రదాయాలకు ప్రతీకగా ఉగాది కిట్
- మట్టి పాత్రలు వాడాలని పిలుపు
- కుల వృత్తులకు ప్రోత్సాహం అవసరం
హైదరాబాద్, (భారతవాసి న్యూస్): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా శాసనసభ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు ఉగాది మట్టి పాత్రలను అందజేశారు. సంప్రదాయ పద్ధతుల్లో పండుగను జరుపుకోవాలని సందేశం ఇచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. “మట్టి పాత్రలు వాడండి – ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కుల వృత్తులను ప్రోత్సహించండి” అనే నినాదంతో ఈ ఉగాది కిట్‌ను అందజేశారు. ఇందులో ఉగాది పండుగకు ఉపయోగపడే మట్టి కుండ, గ్లాసులు, జగ్, బౌల్‌తో పాటు షడ్రుచులకు అవసరమైన మామిడి కాయలు, వేప పువ్వు, బెల్లం, చింతపండు, కారం వంటి పదార్థాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్ర ప్రజలకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని కాపాడుకోవడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి పాత్రల వినియోగం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణలో కూడా మట్టి పాత్రల వినియోగం మంచి ఫలితాలను ఇస్తుందని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాల్లో మట్టి పాత్రలకు ప్రత్యేక స్థానం ఉందని నాయకులు పేర్కొన్నారు. మట్టి పాత్రల వినియోగాన్ని పెంచడం ద్వారా కుల వృత్తులను ప్రోత్సహించవచ్చని తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉగాది పండుగను మట్టి పాత్రలతో జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
