హైదరాబాద్, 20 మార్చి 2026 (భారతవాసి న్యూస్):భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించేందుకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను ఉపయోగించి డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టిస్తూ డిజిటల్ మాధ్యమాల్లో తనను తప్పుగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జ్యోతి సింగ్ బెంచ్, పిటిషన్‌లోని లోపాలను సరిచేయాలని సూచిస్తూ తదుపరి విచారణను మార్చి 23కు వాయిదా వేసింది.
గంభీర్ పిటిషన్‌లో 16 సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. వీరిలో మెటా, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ (యూట్యూబ్) వంటి సోషల్ మీడియా దిగ్గజాలు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు, కేంద్ర ఐటీ, టెలికాం శాఖలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ ద్వారా ఫేస్-స్వాపింగ్, వాయిస్-క్లోనింగ్ చేస్తూ తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వేదికలపై నకిలీ కంటెంట్ పెరిగిందని గంభీర్ అన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్లుగా సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోకు 29 లక్షల వ్యూస్ రావడం, మరో నకిలీ వీడియోకు 17 లక్షల వ్యూస్ రావడం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించడం, భారత జట్టు హెడ్ కోచ్‌గా తన వృత్తి, ప్రతిష్టకు నష్టం కలిగించడం గంభీర్ ఆవేదనగా పేర్కొన్నారు.
తన అనుమతి లేకుండా ఈ-కామర్స్ సైట్లలో పోస్టర్లు, ఇతర వస్తువులు అమ్మబడుతున్నాయని, కొందరు అజ్ఞాతులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారని గంభీర్ ఆరోపించారు. కాపీరైట్, ట్రేడ్‌మార్క్ చట్టాల ప్రకారం తన పేరు, ఫొటో, వాయిస్‌ను అనుమతి లేకుండా వాడకమని, శాశ్వత ఇంజంక్షన్ ఇవ్వాలని, పరువు నష్టం పరిహారంగా రూ. 2.5 కోట్లు, అక్రమ లాభాల లెక్కలు సమర్పించాలని ఆయన కోర్టు నుంచి అభ్యర్థించారు.
ఇటీవలి కాలంలో సునీల్ గవాస్కర్, శ్రీశ్రీ రవిశంకర్, నాగార్జున, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కాజోల్ వంటి ప్రముఖులు తమ వ్యక్తిగత హక్కులను కాపాడేందుకు కోర్టులను ఆశ్రయించడం తెలిసిందే

Spread the love