
హైదరాబాద్, మార్చి 20 ((భారతవాసి న్యూస్):దక్షిణాది సినీ పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్‌గా పేరొందిన మణిరత్నం – ఏ ఆర్ రెహమాన్ జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఈ ఇద్దరూ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో మళ్లీ చేతులు కలపడం సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
1992లో విడుదలైన రోజా సినిమాతో మొదలైన వీరి ప్రయాణం, ఈ కొత్త చిత్రంతో 19వసారి కొనసాగనుండటం విశేషం. సంగీతం, కథనం పరంగా ఎప్పుడూ ప్రత్యేకత చూపే ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’గా పేరొందిన విజయ్ సేతుపతి హీరోగా నటించనుండగా, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే సాయి పల్లవి హీరోయిన్గా కనిపించనుంది. వీరిద్దరి కాంబినేషన్ కూడా మొదటిసారి కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
గతంలో ఈ సినిమాకు మరో యువ సంగీత దర్శకుడు పని చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, వాటన్నింటికీ చెక్ పెడుతూ మణిరత్నం సంస్థ అధికారికంగా రెహమాన్ పేరును ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక ప్రత్యేక గీతాన్ని రెహమాన్ సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ ప్రేమకథగా రూపొందనుందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది.
మణిరత్నం – రెహమాన్ కాంబినేషన్ అంటేనే సంగీతం, భావోద్వేగం కలిసిన మాయాజాలం. ఈసారి కూడా అదే మంత్రం రిపీట్ అవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.