Monday, April 13, 2026
More
    HomeUncategorizedతెలంగాణ రైజింగ్–2047తో సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు

    తెలంగాణ రైజింగ్–2047తో సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు

    • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం
    • పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధి
    • యువత, రైతులు, మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రణాళికలు

    హైదరాబాద్, (భారతవాసి న్యూస్):
    తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దూరదృష్టితో కూడిన ప్రణాళికలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన ప్రభుత్వం లక్ష్యాలు, కార్యాచరణను విస్తృతంగా వివరించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసుకుని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
    2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో “తెలంగాణ రైజింగ్–2047” విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు సీఎం వెల్లడించారు. యువత, మహిళలు, రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక విధానాలను రూపొందించామని చెప్పారు. కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతిక పరిణామాలు భవిష్యత్తులో పెద్ద సవాళ్లుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేలా రాష్ట్రాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
    పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒకప్పుడు రాక్ సిటీ, లేక్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరాన్ని మళ్లీ పూర్వ వైభవంతో తీర్చిదిద్దేందుకు మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేసి ప్రజలకు ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు.
    మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైలు వంటి భారీ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. శంషాబాద్‌ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా కేంద్రంతో కలిసి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధికి అనుకూలంగా ప్రత్యేక తయారీ మండలాలను అభివృద్ధి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు లాభదాయక పంటల మార్పిడి విధానాలు, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి వేల కోట్ల రూపాయల ఆదా కలిగించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు వైద్య సహాయం అందిస్తున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

    Spread the love
    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments