Monday, April 13, 2026
More
    HomeUncategorizedఉగాది కానుకగా 10,060 ఉద్యోగాలు…

    ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాలు…

    యువతకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు
    జాబ్ క్యాలెండర్ విడుదలతో అవకాశాల వెల్లువ
    గ్రూప్-1 నుంచి యూనిఫాం సర్వీసుల వరకు నియామకాలు
    నిర్దేశిత గడువులోనే భర్తీ పూర్తి చేస్తామని హామీ

    అమరావతి, మార్చి 19 (భారతవాసి న్యూస్)): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర యువతకు తీపి కబురు అందించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ నియామక ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం యువత ఆశయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతోందన్నారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా తీసుకుని, పద్ధతిగా జాబ్ క్యాలెండర్‌ను రూపొందించినట్లు వివరించారు. ఈ ఏడాది విడుదల చేసే నోటిఫికేషన్ల ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫాం సర్వీసులు వంటి కీలక విభాగాల్లో పెద్ద సంఖ్యలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
    గత 20 నెలల కాలంలో తమ ప్రభుత్వం ఇప్పటికే 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ముఖ్యంగా మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. నియామక పత్రాలు అందుకున్న యువత కళ్లలో కనిపించిన ఆనందం తమకు మరింత ప్రేరణనిచ్చిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న పవన్, తాజా ఉద్యోగాల ప్రకటనతో మరింత మంది యువతకు భవిష్యత్తు మార్గం సుగమమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో ప్రిపరేషన్ కొనసాగించాలని సూచించారు.
    ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా నియామక ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను విస్తరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

    Spread the love
    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments