టాలీవుడ్‌పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మార్చి 20 (భారతవాసి న్యూస్): నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారాడు. ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ ఉండగా, ఈ చిత్రంపై వస్తున్న ప్రశంసల వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని ఆయన వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది.
రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే భారీ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో, పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
అయితే ఈ ప్రశంసల వెనుక స్వతంత్ర అభిప్రాయం కంటే “ఒత్తిడి రాజకీయాలు” పనిచేస్తున్నాయని ప్రకాష్ రాజ్ ఆరోపించాడు. ఉత్తర భారతంలో తరచూ వినిపించే ఈ విధమైన రాజకీయ ప్రభావం ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలోకూ చేరిందని, ముఖ్యంగా అధికార పార్టీకనుకూలంగా ఉన్న సినిమాలను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి హీరోలకు ఏర్పడిందని ఆయన పరోక్షంగా విమర్శించారు.
సినిమా రంగం స్వతంత్రంగా ఉండాలని, కళాకారులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే వాతావరణం ఉండాలనే అంశాన్ని ఆయన మరోసారి ప్రస్తావించాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.
మరోవైపు, ‘ధురంధర్ 2’ చిత్రానికి ప్రేక్షకాదరణ మాత్రం తగ్గడం లేదు. భారీ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Spread the love