యువ శాస్త్రవేత్తల సమ్మేళనం ప్రారంభం

హైదరాబాద్‌లో డీఆర్‌డీఓ యువ శాస్త్రవేత్తల సమావేశం
“కలిసి ఎదగాలి” ప్రధాన అంశంగా నిర్వహణ
మూడు రోజులపాటు సాంకేతిక, ప్రేరణాత్మక కార్యక్రమాలు

హైదరాబాద్, మార్చి 30 (భారతవాసి న్యూస్): దేశ రక్షణ పరిశోధన రంగంలో యువ శాస్త్రవేత్తల మధ్య సాంకేతిక సమన్వయం పెంపొందించేందుకు డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో 12వ యువ శాస్త్రవేత్తల సమావేశం (వైఎస్‌ఎం-2026) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్‌లు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని పరిశోధన సంస్థలతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. యువ శాస్త్రవేత్తలలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రతి ఏడాది నిర్వహించే ఈ సమావేశం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీఓ ప్రయోగశాలల శాస్త్రవేత్తల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈసారి “కలిసి ఎదగాలి” అనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు.
మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా యువ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. సాంకేతిక సెషన్లు, ప్రేరణాత్మక కార్యక్రమాలు, టీమ్ బిల్డింగ్ కార్యకలాపాలు ఇందులో భాగంగా నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వారా కొత్త ఆలోచనలు, పరిశోధన విధానాలు పంచుకునే అవకాశం లభిస్తుందని, దేశ రక్షణ రంగంలో వినూత్న పరిష్కారాలు అభివృద్ధి చెందుతాయని నిపుణులు భావిస్తున్నారు. యువ శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని వెలికితీసి, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించనుంది.

Spread the love