చెరువుల పునరుద్ధరణకు ఆధునిక యంత్రం ప్రారంభం

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఎక్స్‌కవేటర్ ప్రారంభం
చెరువుల పూడికతీత, డ్రెడ్జింగ్‌కు నూతన సాంకేతికత
నగర నీటి వనరుల సంరక్షణపై దృష్టి
మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మార్చి 30 (భారతవాసి న్యూస్): నగరంలోని చెరువుల పునరుద్ధరణ, నీటి వనరుల సంరక్షణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పీవీ మార్గ్‌లోని సంజీవయ్య పార్క్ సమీపంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన అధునాతన ఎక్స్‌కవేటర్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెరువుల అడుగుభాగంలో పేరుకుపోయిన పూడికను తొలగించడం, డ్రెడ్జింగ్ పనులు నిర్వహించడం, కట్టలను బలోపేతం చేయడం వంటి కీలక పనుల్లో ఈ యంత్రం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. నగరంలో చెరువులను పునరుద్ధరించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమన్నారు. నీటి కలుపు మొక్కల తొలగింపు, బురద, శిధిలాల తొలగింపు వంటి పనులను వేగంగా నిర్వహించేందుకు ఈ యంత్రం సహాయపడుతుందని మంత్రి వివరించారు. పాత చెరువులను పునరుద్ధరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
కూకట్‌పల్లి నాలా, సరస్సులు వంటి ప్రాంతాల్లో ఈ యంత్రాన్ని వినియోగించి నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచనున్నట్లు తెలిపారు. నగరంలో వరద సమస్యలను తగ్గించడంలో కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. పండుగల సమయంలో గణేశ, దుర్గా విగ్రహ నిమజ్జనం, బతుకమ్మ, ఛత్ పూజ వంటి సందర్భాల్లో చెరువులను శుభ్రంగా ఉంచేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ప్రతి షిఫ్ట్‌కు నైపుణ్యం గల సిబ్బందిని నియమించి యంత్రాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని, నగర అభివృద్ధి పనుల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Spread the love