రంగమ్మత్త పాత్ర మిస్ చేసిన రాశి

హైదరాబాద్, మార్చి 30 ((భారతవాసి న్యూస్):
టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రంగస్థలం’ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో చరణ్ ‘చిట్టిబాబు’ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలోని ప్రతి పాత్రకూ ప్రత్యేక గుర్తింపు లభించగా, ముఖ్యంగా ‘రంగమ్మత్త’ పాత్రకు విశేష స్పందన వచ్చింది.
ఈ పాత్రలో అనసూయ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, మొదట ఈ పాత్ర కోసం మరో హీరోయిన్‌ను సంప్రదించినట్లు తాజాగా బయటపడింది. ఆ నటి మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ రాశి.
సుకుమార్ ముందుగా రంగమ్మత్త పాత్ర కోసం రాశిని ఎంపిక చేయాలని భావించారని సమాచారం. కానీ ఆ పాత్రలో ప్రేక్షకులు తనను ఎలా స్వీకరిస్తారో అనుమానంతో ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించినట్లు రాశి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రంగమ్మత్త పాత్ర కొంచెం రఫ్‌గా ఉంటుందని, తాను ఎక్కువగా సానుభూతి పాత్రలకు సరిపోతానని భావించి ఆ పాత్ర చేయలేనని చెప్పినట్లు తెలిపారు.
అలా రాశి వదులుకున్న ఈ పాత్ర చివరకు అనసూయకు దక్కింది. అనసూయ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు రావడంతో పాటు, వరుస అవకాశాలు కూడా దక్కాయి.
ఇప్పుడు ఈ విషయం తెలిసిన అభిమానులు, రాశి ఆ పాత్ర చేసినా బాగుండేదని, ఆమె కెరీర్‌కు మరో మలుపు వచ్చేదని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

Spread the love