Monday, April 13, 2026
More
    HomeUncategorizedభద్రాచలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

    భద్రాచలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

    • అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం
    • మూడు దశల్లో ఆలయ అభివృద్ధి పనులు
    • పుష్కరాల నాటికి తొలి దశ పూర్తి లక్ష్యం
    • ట్రైబల్ మ్యూజియం, పరిసర దేవాలయాల అభివృద్ధి

    హైదరాబాద్, మార్చి 20 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాద్రిని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రులు తెలిపారు. ఆలయ రూపురేఖలను మార్చేలా సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు.
    ఈ మాస్టర్ ప్లాన్‌పై శుక్రవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి పాల్గొన్నారు. రెండు వందల సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా భక్తుల భావోద్వేగాలను గౌరవిస్తూ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. మూడు దశల్లో ఆలయ అభివృద్ధి చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పుష్కర ఘాట్‌తో పాటు మొదటి దశ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.


    భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు. భద్రాచలం సమీపంలోని రామవరం ప్రాంతంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల సందర్భంగా కొరివి వీరభద్రస్వామి, మల్లూరు నరసింహస్వామి దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడం, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

    Spread the love
    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments