

వట్టినాగులపల్లిలో భూ కబ్జాల ఆరోపణలు
బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ మద్దతు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 30 (భారతవాసి న్యూస్): రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో భూ వివాదం రాజకీయ రంగు దాల్చింది. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన కుమారుడిపై భూ కబ్జా ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. బాధితులు సతీష్ షా కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, 1960 నుంచి సతీష్ షా కుటుంబం ఆ భూమిని కలిగి ఉందని తెలిపారు. గత 60 సంవత్సరాలుగా అదే కుటుంబం పేరుమీద భూమి కొనసాగుతోందని, ప్రస్తుతం దాని విలువ సుమారు రూ.1400 కోట్లకు చేరుకుందని చెప్పారు.
ఈ విలువైన భూమిపై మంత్రి కన్ను పడిందని, భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని తెలిపారు. అయితే బాధిత కుటుంబం భూమిని అమ్మడానికి లేదా అభివృద్ధికి ఇవ్వడానికి నిరాకరించిందని పేర్కొన్నారు.
దీంతో అక్రమ చర్యలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ, రెవెన్యూ అధికారుల ద్వారా దొంగ సర్వేలు చేయించి బాధితులను వేధించారని విమర్శించారు. భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించడంతో పాటు, గుండాలతో కలిసి గోశాల, కాంపౌండ్ గోడలను కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారిని కూడా బదిలీ చేశారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి మధ్య ఉన్న అనుబంధంతోనే ఈ చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి అన్యాయాలకు గురైన వారు ముందుకు రావాలని, వారికి పార్టీ మరియు న్యాయపరంగా పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిపారు.
