🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 07 Sep, 2026 | Page: 1

ఆరు గ్యారంటీలు.. 420 హామీల అమలేది?

మహాదేవపూర్, భారతవాసి:
ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ మండల శాఖ నాయకులు సోమవారం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాకంఠక పాలన సాగిస్తోందని వారు ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంపీడీఓ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు అభయహస్తం మేనిఫెస్టోతో పాటు ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను ప్రకటించిందని నాయకులు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 33 నెలలు దాటినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా, వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు పింఛన్‌, నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చారని తెలిపారు.

అయితే ఇప్పటి వరకు ఆయా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, 13 డిక్లరేషన్లలోని అంశాలను, 420 హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ మండల శాఖ నాయకులు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home