🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 14 Sep, 2026 | Page: 1

కాటారం ప్రజల సమస్యలపై దుద్దిళ్లకు శ్రద్ధ ఏది?



కాటారం:
కాటారం మండల ప్రజలు ప్రతి ఎన్నికల్లో మెజార్టీ ఇస్తున్నప్పటికీ వారి సమస్యల పరిష్కారంపై దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శ్రద్ధ చూపడం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ విమర్శించారు. ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌ ఎన్నిటికైనా దిగజారుతారని ఆరోపించారు. సోమవారం ఒడిపిలవంచ ఊర చెరువు, జాదరావుపేట పెద్ద చెరువు, వీరాపూర్‌ శివశంకర్‌ ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ ఏడాదిలోపు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారికి పరిహారం అందిస్తామని చెప్పినా ఇప్పటికీ పలువురికి పరిహారం అందలేదని ఆరోపించారు.కాటారం ప్రజలు 2009లో ఆరు వేలకుపైగా, 2014లో 239, 2018లో 6,585, 2023లో 7,480 ఓట్ల మెజార్టీ ఇచ్చారని పుట్ట మధూకర్‌ గుర్తు చేశారు. ఇంతటి మెజార్టీ ఇస్తున్నా మండల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.ఒడిపిలవంచ, జాదరావుపేట, వీరాపూర్‌ చెరువుల కింద వేల ఎకరాల భూములు ఉన్నా సాగునీరు అందడం లేదన్నారు. చెరువులకు రింగ్‌బండ్‌లు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేయాలని, వర్షాలతో వృథాగా పోతున్న నీటిని రైతుల అవసరాలకు వినియోగించాలని కోరారు. మంథని–కాటారం రహదారి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.దుద్దిళ్ల కుటుంబానికి కాటారం ప్రజలతో ఓటు సంబంధం మాత్రమే ఉందని ఆరోపించారు. తనకు కాటారం ప్రజలతో పేగు సంబంధం ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, దుద్దిళ్ల శ్రీధర్‌ మెడలు వంచే వరకు పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఇప్పటికైనా చెరువులను పునరుద్ధరించి వచ్చే వానాకాలం నాటికి ఆయకట్టు భూములను సాగులోకి తీసుకురావాలని పుట్ట మధూకర్‌ డిమాండ్‌ చేశారు.
🏠 Home