🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 25 Sep, 2026 | Page: 1

మూడేళ్లలో మొండిచేయి... నిందలు మాత్రం బీఆర్ఎస్ పైనా?

మహాదేవపూర్ : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కటకం అశోక్ గురువారం చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ మండల యువజన నాయకుడు బుర్రి రవి ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలన కాలానికి చేరువవుతున్నా, మహాదేవపూర్ మండలంలో ఒక్క పని కూడా చేయని మంత్రి శ్రీధర్ బాబును కాపాడుకోవడానికే ఇలాంటి అర్థం లేని ప్రెస్ మీట్లు పెడుతున్నారని ధ్వజమెత్తారు.అగ్నిమాపక కేంద్రం ప్రారంభానికి "ఫైర్ ఇంజన్" షెడ్ పూర్తిగా క్యూరింగ్ కావాలని, చిన్న కాళేశ్వరం పనులు క్యూరింగ్ వల్లనే ఆలస్యమవుతున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.40 ఏండ్లు ఒకే కుటుంబం చేతిలో అధికారం ఉందని, కేవలం మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధు పనిచేసింది 4.5 సంవత్సరాల కాలమేనని, మహాదేవపూర్ మండల అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ, పుట్ట మధు చొరవతోనే సాధ్యమైందని, ఇప్పుడు మతిభ్రమించి మాట్లాడింది ఎవరో అర్థం చేసుకోవాలని అన్నారు.

బీఆర్ఎస్ హయంలో సింగరేణి ఫండ్ దోచుకుంటే, అప్పటి మంథని ఎమ్మెల్యేగా మీ మంత్రిగారి వాటా ఎంతో ప్రజలకు తెలపాలని సవాల్ విసిరారు.మహాదేవపూర్ లో కస్తూర్బా విద్యాలయం, వ్యవసాయ గిడ్డంగులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అని, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రజా ఉద్యమంతోనే సాధ్యమైందని, డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణం, గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని స్పష్టం చేశారు.మీరు నలభై ఏండ్లుగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఉంటే, ఇంకా ఇండ్లు లేనివారు ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు పెద్ద నాయకులకే ఇచ్చారని, పేదలకు ఇచ్చింది ఏమీ లేదని కాంగ్రెస్ కార్యకర్తలే బాహాటంగా మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
🏠 Home