Monday, April 13, 2026
More
    HomeUncategorizedహనుమకొండలో ఉద్రిక్తత శాంతి ర్యాలీ పేరిట హంగామా… హనుమకొండ కలెక్టరేట్ ముట్టడికి యత్నం…

    హనుమకొండలో ఉద్రిక్తత శాంతి ర్యాలీ పేరిట హంగామా… హనుమకొండ కలెక్టరేట్ ముట్టడికి యత్నం…

    పోలీసులపై దాడి..
    హనుమకొండ,భారతవాసి ప్రతినిధి:
    హనుమకొండ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ అదాలత్ సమీపంలోని అమరవీరుల స్తూపం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మొదట శాంతియుతంగా ప్రారంభమైన ఈ ర్యాలీ, అనంతరం హంగామాగా మారింది.
    కలెక్టరేట్‌కు చేరుకున్న తరువాత బీజేపీ శ్రేణులు తమ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ, కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు ముందుగానే అప్రమత్తమై వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, నిరసనకారులు ఆ సూచనలను లెక్కచేయకుండా గేటును బలవంతంగా తెరచేందుకు యత్నించారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, కొంతమంది కార్యకర్తలు పోలీసులపైకి దాడికి దిగినట్లు సమాచారం.


    ఈ ఘటనలో సీఐ, ఎస్సై స్వల్ప గాయాలు కాగా మరో పోలీసు సిబ్బందికి చేతి వద్ద గాయాలు అయ్యాయి. ఒక ఎస్సై వాచీ కూడా విరిగిపోయినట్లు తెలిసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
    పోలీసులు ముందుగా 20 మంది ప్రతినిధులతో కూడిన బృందాన్ని మాత్రమే కలెక్టర్‌ను కలిసేందుకు అనుమతిస్తామని సూచించినప్పటికీ, ఆ నిర్ణయాన్ని నిరసనకారులు పట్టించుకోకపోవడం గమనార్హం. క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీగా పేరున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    ఈ సందర్భంగా పోలీసులు ఘాటుగా స్పందించారు. “శాంతియుత ర్యాలీ పేరుతో విధ్వంసానికి యత్నించడం తగదు. ఇదే పరిస్థితిలో పోలీసులు చర్యలు తీసుకుంటే దౌర్జన్యమని విమర్శలు చేస్తారు. కానీ ఇప్పుడు జరిగిన ఘటనపై కూడా ఆలోచించాలి” అని పేర్కొన్నారు.
    మొత్తానికి, హనుమకొండలో జరిగిన ఈ సంఘటన శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రను మరోసారి స్పష్టం చేయగా, రాజకీయ ఆందోళనలు హింసాత్మక దిశగా మళ్లితే ప్రజాస్వామ్యానికి ముప్పు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

    Spread the love
    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments