దేశంలో చమురు కొరత లేదు: కేంద్రం స్పష్టం

60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్న ప్రభుత్వం
పుకార్లతో ప్రజల్లో ఆందోళన – అధిక కొనుగోళ్లు
సరఫరా, ధరల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 26 (భారతవాసి న్యూస్): దేశంలో చమురు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి ఇంధనాల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కనీసం 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇటీవల చమురు కొరత ఉందన్న పుకార్ల కారణంగా ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూలు కడుతున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రచారం ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని, దీనివల్ల వినియోగదారులు అవసరానికి మించి కొనుగోళ్లు చేస్తున్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సాధారణంగానే సరఫరా కొనసాగుతోందని స్పష్టం చేసింది.
దేశంలో ఎక్కడా చమురు కొరత లేదని, ధరలు కూడా ఎప్పటిలాగే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూలు కట్టాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించింది. సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. భారత్ పెట్రో ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉండగా, ఆయిల్ రిఫైనింగ్ సామర్థ్యంలో నాలుగో స్థానంలో ఉందని కేంద్రం తెలిపింది. దేశంలోని రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, 150కు పైగా దేశాలకు పెట్రో ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించింది.
దేశంలోని ఆయిల్ కంపెనీల వద్ద 60 రోజులకు సరిపడా క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వ్యూహాత్మక నిల్వలతో కలిపి మొత్తం 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నా దేశంలో ఇంధన సరఫరా నిలకడగా కొనసాగుతుందని భరోసా ఇచ్చింది. దేశీయంగా ఎల్పీజీ నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయని, ఉత్పత్తి పెంచుతున్నామని కేంద్రం వెల్లడించింది. విదేశాల నుంచి కూడా కార్గోల ద్వారా చమురు దిగుమతులు కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రతి పౌరుడికి అవసరమైన ఇంధనం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేసింది.

Spread the love