-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

-ఉగాది ఉత్సవాలు అభినందనీయం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్…


జయశంకర్ భూపాలపల్లి (భారతవాసి న్యూస్):సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది ఉత్సవ నిర్వహణ కమిటీ శ్రీ వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇల్లంద క్లబ్ లో నిర్వహించారు.రాష్ట్రస్థాయి ఉత్సవ ఉగాది పురస్కారాలు, భూపాలపల్లి మున్సిపాలిటీ పాలకవర్గానికి సన్మానోత్సవము,సంజీవనము పుస్తకావిష్కరణ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి
ఎర్రం సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా, కొలుగూరి సంజీవరావు తొలి పలుకులు వినిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, కళాకారులచే ఏర్పాటుచేసిన నృత్యాలను, పాటలను కవితలను తిలకించారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….
ఉగాది అంటేనే తెలుగు వారి పండుగ. నూతన తెలుగు సంవత్సరం ఈ ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుందన్నారు. కాబట్టి ఉగాది పండుగ తెలుగు వారి పండుగగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తెలుగు నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితుల గురించి తెలుసుకొని శాంతిపూజలు, హోమాలు లాంటివి జరిపించుకొని సుఖశాంతులతో ఉండేందుకు పంచంగ శ్రవణం చేస్తారనీ వివరించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ… ఉగాది ఉత్సవ పురస్కారాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.
తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకొనే పండుగ ఉగాది పండుగ అన్నారు. అడుగడుగునా తెలుగువారి సంప్రదాయ రీతులు ప్రతిబింబిస్తూ కొత్త సంవత్సరం ఆరంభానికి స్వాగతం పలుకుతుందన్నారు. ఈ పండుగ పూర్వం నుంచే ఆనవాయితీగా వస్తుందన్నారు. . సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి, చెడులను, కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలని ఈ పరాభవ సంవత్సరంలో అందరూ జయాలు పొందాలని ఆకాంక్షించారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ఉగాది ఉత్సవ నిర్వహణ కమిటీ, శ్రీ వివేకానంద సేవ సమితి సభ్యులను అభినందించారు.
సంజీవనము పుస్తకావిష్కరణ
శ్రీ వివేకానంద సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొలుగూరి సంజీవరావు రచించిన సంజీవనము పుస్తకాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, పలువురు ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు.
ఇదే క్రమంలో రాష్ట్రస్థాయి లో గుర్తింపు పొందిన కవులు, కళాకారులు, రచయితలకు, నృత్య, కళాకారులకు శాలువా మెమొంటో ప్రశంస పత్రాలతో సన్మానించారు.

Spread the love