రూపాయి భారీ పతనం

ముంబై, మార్చి 30 ((భారతవాసి న్యూస్):
భారత కరెన్సీ రూపాయి సోమవారం డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో రూపాయి విలువ రోజురోజుకు బలహీనపడుతూ, ఈ రోజు తొలిసారిగా 95 స్థాయిని దాటింది.
మార్కెట్ ట్రేడింగ్‌లో ఒక దశలో రూపాయి భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 95.14 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. రోజు ప్రారంభంలో మాత్రం కొంత బలపడిన రూపాయి 93.59 వద్ద ప్రారంభమైనప్పటికీ, ట్రేడింగ్ ముగిసే సరికి మళ్లీ తీవ్రంగా పడిపోయింది.
రూపాయి బలహీనతకు పలు అంతర్జాతీయ కారణాలు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 109 డాలర్లకు పైగా ఉండటం దేశ ఆర్థిక పరిస్థితులపై ఒత్తిడిని పెంచుతోంది.
ఇదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెలలోనే సుమారు 11.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు బయటకు వెళ్లినట్లు అంచనా. గత శుక్రవారం మాత్రమే విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ.850 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను విక్రయించినట్లు సమాచారం.
ఈ పరిణామాలన్నింటి ప్రభావంతో రూపాయి విలువ నిరంతరం పడిపోతూ ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు స్థిరపడే వరకు రూపాయి పై ఒత్తిడి కొనసాగవచ్చని చెబుతున్నారు. పెట్టుబడిదారులు, దిగుమతిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Spread the love