అమ్మవార్లను దర్శించుకున్న ‘ప్యారడైజ్‌’ బృందం

ములుగు: ‘ప్యారడైజ్‌’ సినిమా బృందం ములుగు జిల్లాలో పర్యటించింది. హీరో నాని, నటుడు సంపూర్ణేష్‌బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం చేరుకున్న చిత్రబృందానికి ఆదివాసీ పూజారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు. హీరో నాని మేడారం వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనను చూసేందుకు ఆసక్తి చూపడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.