కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ఉద్రిక్తత

కన్నెపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గోదావరి నీటి పరిస్థితిని పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు పంప్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు పంప్‌హౌస్‌ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గేటు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, వివేకానందగౌడ్‌, లక్ష్మారెడ్డి, కృష్ణారావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసనలో పాల్గొన్నారు.