• సమగ్రాభివృద్ధికి బ్లూప్రింట్
  • రూ. 3.24 లక్షల కోట్ల భారీ ప్రణాళిక
  • ప్రతి వర్గానికి సంక్షేమం–అభివృద్ధి లక్ష్యం
  • రైతు, మహిళ, యువతకు ప్రత్యేక ప్రాధాన్యం

హైదరాబాద్, మార్చి 20 (భారతవాసి న్యూస్): ): రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అన్ని కీలక రంగాలకు సమతుల్యంగా కేటాయింపులు చేస్తూ ఈ బడ్జెట్ రూపొందించబడింది. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం లభించగా, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. పాలకులుగా కాకుండా ప్రజాసేవకులుగా పరిపాలన సాగిస్తున్నామని, ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పారదర్శక పాలన అందిస్తున్నామని పేర్కొంది.


ఈ బడ్జెట్‌లో అత్యంత కీలక ఆకర్షణగా “ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా” పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనుంది. అదేవిధంగా చేయూత పథకం కింద 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయడం, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కొనసాగించడం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించడం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వంటి పథకాలు కొనసాగుతున్నాయి. మహిళా శక్తి మిషన్ ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు బడ్జెట్ దారితీసింది. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం ద్వారా విద్యార్థుల పోషకాహార స్థాయిని మెరుగుపరచనుంది. రాష్ట్రంలోని 57 పాలిటెక్నిక్ కాలేజీలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చి, కొత్తగా 15 కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఏటీసీల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ అందించనుంది. 105 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించడంతో పాటు ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 2,500 పాఠశాలలకు ప్రీ-ప్రైమరీ విభాగాలను విస్తరించనుంది.
వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయిస్తూ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల పెట్టుబడి సహాయం అందించనుంది. సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.18 కోట్ల లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతుంది. సాగునీటి ప్రాజెక్టులకు రూ.22,615 కోట్లు కేటాయించి పలు ఎత్తిపోతల పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్ రంగానికి రూ.21,285 కోట్లు, విద్యా రంగానికి రూ.26,674 కోట్లు, వైద్య ఆరోగ్య రంగానికి రూ.13,679 కోట్లు కేటాయించింది. ఆరోగ్య రంగంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడం, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించడం, సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ ఆసుపత్రులు, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేయనుంది.
పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధికి కూడా పెద్దపీట వేసింది. మూసీ నది పునరుద్ధరణ, గోదావరి నీటిని తరలించడం, 39 ఎస్టీపీల నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైలు, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం, పారిశ్రామిక హబ్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హోం శాఖకు రూ.11,907 కోట్లు కేటాయించి శాంతిభద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై దృష్టి సారించింది. 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ.500 కోట్లు కేటాయించింది. క్రీడలు, పర్యాటక రంగాల అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలు రూపొందించింది. మొత్తంగా ఈ బడ్జెట్‌ను తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలకు ప్రతిబింబంగా ప్రభుత్వం పేర్కొంది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగే విధంగా రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Spread the love