ఆర్టీసీ సమస్యలపై ముఖాముఖి సమావేశం

  • కొత్త బస్సులు, రూట్లు, మౌలిక వసతులపై వినతులు
  • మహాలక్ష్మీ పథకంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ
  • అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలపై ప్రత్యేక దృష్టి
  • పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, మార్చి 28 (భారతవాసి న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవల మెరుగుదలపై ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం జరిగింది.
మహాలక్ష్మీ పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, నియోజకవర్గాల వారీగా అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. కొత్త బస్సులు, కొత్త రూట్లు, బస్ స్టేషన్‌ల అభివృద్ధి, బస్ హాల్టింగ్ సదుపాయాలు, డిపోలు, టాయిలెట్ల నిర్మాణం వంటి అంశాలపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు సమర్పించారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గానికి తగిన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేకంగా గ్రామీణ, దూర ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో బస్ స్టేషన్ అభివృద్ధి, కొత్త రూట్లలో బస్సులు నడిపించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. సింగరేణి ప్రాంతంలో కార్మికులకు ఇబ్బందులు లేకుండా పాత రూట్లతో పాటు అదనపు రూట్లు కూడా ప్రవేశపెట్టాలని కోరారు.
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Spread the love