Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మట్టి గణపతులతో పర్యావరణంపై అవగాహన

Author Eravelli Harshini | 14 Sep 2026, 01:42 PM | TELANGANA
మట్టి గణపతులతో పర్యావరణంపై అవగాహన

మహాదేవపూర్:
పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అవగాహన కల్పిస్తూ మహాదేవపూర్‌ బాలుర పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితిని పురస్కరించుకుని విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వందకు పైగా మట్టి గణపతి విగ్రహాలను సోమవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సైన్స్‌ ఉపాధ్యాయులు, ఎన్‌జీసీ ఇన్‌చార్జి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల జలవనరులకు, జలచరాలకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. భక్తితో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సైన్స్‌ ఉపాధ్యాయుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పెద్ద విగ్రహాలకు బదులుగా చిన్నవైనా పర్యావరణహిత మట్టి గణపతి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చన్నారు. గత ఐదేళ్లుగా పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయించి గ్రామస్తులకు పంపిణీ చేస్తున్నామని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.సైన్స్‌ ఉపాధ్యాయుడు మడక మధు మాట్లాడుతూ హానికర రంగులతో కూడిన ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను పూజించాలని సూచించారు. “మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం. భక్తితో పండుగను జరుపుకుంటూనే భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం” అని పిలుపునిచ్చారు.