Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పూల పండుగకు మురిసిన మహిళలు

Author Pulluri srinivas | 18 Oct 2026, 06:56 PM |
 పూల పండుగకు మురిసిన మహిళలు

నర్సంపేట : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను కొలువుదీర్చి, సంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.
పూలతో పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తంగేడు, గునుగు, బంతి తదితర పుష్పాలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను మహిళలు చేతబట్టి ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
పట్టణంలోని వీధుల్లో మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో కనిపించడంతో పండుగ వాతావరణం నెలకొంది. పలువురు మహిళలు పరస్పరం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటూ, పసుపు, కుంకుమలు పంచుకుంటూ సాంప్రదాయ ఆచారాలను కొనసాగించారు.
సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు బతుకమ్మకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. సద్దులతో పాటు పులిహోర, పెరుగన్నం తదితర వంటకాలను నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకెళ్లారు.
పల్లె నుంచి పట్టణం వరకు బతుకమ్మ పాటలతో మార్మోగిన తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఆనందోత్సాహాలను నింపాయి.