Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణ జానపద జీవనానికి సజీవ దర్పణం – బతుకమ్మ

Author Eravelli Harshini | 09 Oct 2026, 09:58 AM | TELANGANA
తెలంగాణ జానపద జీవనానికి సజీవ దర్పణం – బతుకమ్మ

– ప్రిన్సిపాల్ డాక్టర్ జన్ను విజయ్ కుమార్
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహాదేవపూర్‌లో
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇ. మాధవి గారి ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జన్ను విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ “బతుకమ్మ తెలంగాణ జానపద జీవనానికి సజీవ దర్పణం. స్త్రీలకు, ప్రకృతికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, స్త్రీల ఐక్యతను చాటుతూ జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ధర్మం అధర్మంపై, సత్యం అసత్యంపై విజయం సాధించిన సందర్భాలను సైతం బతుకమ్మ పండుగలోని సాంస్కృతిక భావనతో అనుసంధానించవచ్చని తెలిపారు. విద్యార్థినులు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా తొమ్మిది రోజులపాటు బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించారు. ప్రకృతిలో సహజంగా లభించే తంగేడు, గునుగు, బంతి, మందారం, కట్ల పూలు, గుమ్మడి పూలు తదితర పుష్పాలను సేకరించి, వాటిని నిష్ఠతో గోపురాకారంలో పేర్చి అందమైన బతుకమ్మలను రూపొందించారు. బతుకమ్మపై పసుపు, కుంకుమలతో తయారు చేసిన గౌరమ్మను ప్రతిష్ఠించి, అగరబత్తులు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
అనంతరం విద్యార్థినులు బతుకమ్మలను కళాశాల ప్రాంగణంలోకి తీసుకువచ్చి, బతుకమ్మల చుట్టూ వలయాకారంలో నిలబడి బతుకమ్మ పాటలు ఆలపిస్తూ, చప్పట్లు కొడుతూ ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, నృత్యాలతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు.

తెలంగాణ జానపద జీవనానికి సజీవ దర్పణం – బతుకమ్మ - Additional Image